ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నాం
కరోనాకు మందు లేదు...నివారణే మార్గం
తప్పనిసరిగా వ్యక్తులమధ్య దూరాన్ని పాటించాలి
4వ తేదీ నుంచి తెల్లకార్డుదారులకు రూ.వెయ్యి పంపిణీ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి
(బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విజయనగరం)
లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందీ పడకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలనూ తీసుకున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. రైతు బజార్ల వికేంద్రీకరణలో భాగంగా విజయనగరం పట్టణంలోని రాజీవ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడి కూరగాయల ధరలపై వాకబు చేశారు. కూరగాయల విక్రేతలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానికులకు మాస్క్‌లు పంపిణీ చేశారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి శ్రీవాణి మీడియాతో మాట్లాడారు. ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బంది పడకుండా జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలనూ తీసుకుందని చెప్పారు. దీనిలో భాగంగానే పట్టణంలోని రైతు బజార్లను వికేంద్రీకరించి, రద్దీ లేకుండా కూరగాయాలను పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉంచామన్నారు. అలాగే నిత్యం ధరలను సమీక్షిస్తున్నామని చెప్పారు. భౌతిక దూరాన్ని పాటించేవిధంగా మార్కెట్లలో కూడా వెదురు రింగులతో తగిన ఏర్పాటు చేశామని, అలాగే రక్షణా చర్యలను కూడా తీసుకున్నామని చెప్పారు. ప్రజలు, విక్రేతలు ఇబ్బంది పడకుండా త్రాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పించామన్నారు.
తమ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ను అమలు చేసిన నేపథ్యంలో, పేదలు ఇబ్బంది పడకుండా తెల్ల రేషన్ కార్డు కలిగిఉన్న ప్రతీ కుటుంబానికి తమ ప్రభుత్వం రూ.1000 అందజేస్తుందని, ఈ నెల 4వ తేదీ నుంచి పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఉచితంగా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని గతనెల 29 నుంచీ ప్రారంభించామని, ఇప్పటికే దాదాపు 65శాతానికి పైగా పంపిణీ పూర్తయ్యిందని తెలిపారు. అలాగే వలంటీర్ల ద్వారా సామాజిక పింఛన్లను ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమం జిల్లాలో తొలిరోజే దాదాపు 93శాతం పూర్తి చేశామని చెప్పారు. ఇలా ఇప్పటివరకు సుమారు 3లక్షల, 26వేల మందికి దాదాపు రూ.77కోట్ల రూపాయలను పింఛన్ రూపంలో పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు.
కరోనా నియంత్రణకు రాష్ట్రప్రభుత్వం పటిష్టమైన చర్యలను తీసుకుందని చెప్పారు. అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లివచ్చిన వారి వల్లే రాష్ట్రంలో కూడా అనూహ్యంగా కేసుల సంఖ్య పెరిగిందని చెప్పారు. అయినప్పటికీ ప్రజలు ఆందోళన చెందవద్దని, వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని చెప్పారు. ప్రజలు కూడా తమవంతుగా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కరోనాకు మందులేదని, నివారణే ఏకైక మార్గమని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తులమధ్య తప్పనిసరిగా దూరాన్ని పాటించాలని, తరచూ చేతులను సబ్బుతో కడుగుకోవాలని కోరారు. లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని శ్రీవాణి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్‌వర్మ, అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, తాశీల్దార్ జిఎస్ఎన్‌మూర్తి, మార్కెటింగ్ ఎడి శ్యామ్‌కుమార్, వైకాపా రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జి మజ్జి శ్రీనివాసరావు, మార్కెట్‌కమిటీ ఛైర్మన్ జమ్ము శ్రీనివాసరావు, ఇంకా కెవి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment