పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
పొలాలకు వెళ్లే రైతుల రాకపోకలకు అనుమతించాలి
తోపుడుబళ్లకు అదనపు సమయం ఇచ్చేందుకు ప్రతిపాదన
ఇతర రాష్ట్రాలకు మామిడి ఎగుమతి మొదలు
జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్
విజయనగరం,
రైతు పండించిన ఏ పంటకైనా గిట్టుబాటు ధరను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ స్పష్టం చేశారు. అందుకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించాలని పలు ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, వ్యాపారులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో తన ఛాంబర్‌లో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొని ఆయా శాఖల అధికారులతో చర్చించి, పరిష్కారాన్ని సూచించారు.
తమ పంటకు గిట్టబాటు ధర రావడం లేదని అరటి రైతులు వాపోయారు. పొలాలకు వెళ్లేటప్పుడు పోలీసులనుంచి అభ్యంతరం వస్తోందని ఫిర్యాదు చేశారు. మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాంబాబు వివరించారు. దీనిపై జెసి స్పందిస్తూ, డ్వాక్రా సంఘాల ద్వారా అరటిని కొనుగోలు చేయించి, గిట్టుబాటు ధరను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే అరటి ఎగుమతికి ఎక్కడా అడ్డంకులు లేకుండా చూడాలని, అలాగే రైతుల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలని పోలీసు అధికారులను కోరారు. అరటి సహజసిద్దంగా పండేలా చూడాలని, ఆలస్యంగా పక్వానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేయాలని జెసి సూచించారు. వీధుల్లోకి వెళ్లి పళ్లు, కూరగాయలను విక్రయించే తోపుడు బళ్లకు లాక్‌డౌన్‌లో అదనపు సమయం మినహాయింపునివ్వాలని ప్రతిపాదన చేస్తామని జెసి హామీ ఇచ్చారు. మొక్కజొన్న కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయి వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో తరచూ మాట్లాడి, పంటల వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని వ్యవసాయశాఖ జెడి ఎం.ఆశాదేవికి జెసి సూచించారు.
మామిడి పంటకు సంబంధించి పెద్దగా ఇబ్బందుల్లేవని, ఇటీవలే ఢిల్లీ, ఛత్తీస్‌ఘడ్, ఒడిషా, పశ్చిమబెంగాల్ తదితర ప్రదేశాలకు గూడ్సు ద్వారా ఎగుమతి కూడా ప్రారంభమయ్యిందని ఉద్యానశాఖ డిడి పాండురంగ, ఎడి లక్ష్మి వివరించారు. రోజుకు సుమారు 250 మెట్రిక్ టన్నుల వరకు మామిడి ఎగుమతి జరుగుతోందని చెప్పారు. ధాన్యం కొనుగోలులో ఎదుర్కొంటున్న సమస్యలను మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొండపల్లి కొండబాబు అధికారుల దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా 1156 రకం ఏ గ్రేడ్ లో చేర్చారని, అయితే దానికి తగిన దిగుబడి, నాణ్యత రావడం లేదని, దీనిని సాధారణ రకంగా గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై జెసి స్పందిస్తూ, ఈ ఒక్కసారికి 1156 రకాన్ని అనుమతించాలని మిల్లర్లను కోరుతూ, సమస్య పరిష్కారానికి వారితో సమావేశమవ్వాలని జిల్లా సరఫరా అధికారి వరకుమార్‌ను జెసి ఆదేశించారు. ప్రస్తుతం నిత్యావసరాల ధరలను మార్కెటింగ్ ఏడి వై.వి.శ్యామ్‌కుమార్ వివరించారు. కొన్ని నూనెలు తదితర కొన్ని సరుకుల ధరల్లో పెరుగుదల ఉందని, కొన్ని రకాల పప్పుల ధరలు తగ్గాయని చెప్పారు. బయట ప్రాంతాలనుంచి వచ్చే కొన్ని రకాల సరుకుల ధరలు, అక్కడి పరిస్థితులను బట్టి స్వల్పంగా పెరిగాయని, కొన్ని తగ్గాయని ఏడి చెప్పారు. దీనిపై హోల్ సేల్ అసోసియేషన్ ప్రతినిధులతో జెసి చర్చించారు. సాధ్యమైనంతవరకూ ధరలు పెరగకుండా చూడాలని వారిని కోరారు. అనంతరం జెసి కిశోర్ మాట్లాడుతూ రైతు తాను పండించే పంటకు గిట్టుబాటు ధరను కల్పించడమే ప్రభుత్వ శాఖల లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ జిల్లాలో నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరగకుండా చర్యలను తీసుకున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి కొనసాగేలా చూస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రామాలకు వెళ్లి, రైతులవద్దనుంచి పంటలను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే తమ పంటలను మార్కెట్‌కు తరలించడంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తామని, వారికి తగిన మార్కెట్, రవాణా సౌకర్యాలను కల్పిస్తామని జెసి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఏ పిడి కె.సుబ్బారావు, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్.వి.రమణకుమారి, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, డిసిసిబి సిఇఓ జనార్ధన్, సిఐ శ్రీహరిరాజు, ఎంపిడిఓ రాజ్‌కుమార్, బ్రేక్ ఇన్‌స్పెక్టర్ బుచ్చిరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment