1902 కాల్ సెంటర్ కు వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలి
ఫిర్యాదు దారులకు పరిష్కారం వివరాలను తెలియజేయాలి : జిల్లా కలెక్టర్
విజయనగరం,
కరోనా లాక్ డౌన్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1902 కాల్ సెంటర్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుకు నిజాయితీ తో కూడిన, నాణ్యమైన, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ ఆదేశించారు. జిల్లా యంత్రాంగానికి ఈ కంట్రోల్ రూమ్ కళ్ళు, చెవులుగా వుండాలన్నారు. కరోనా నియంత్రణ, సహాయక చర్యల్లో కంట్రోల్ రూమ్ ఎంతో కీలకంగా వ్యవహరించాలన్నారు. జిల్లాలో లాక్ డౌన్ నేపథ్యంలో కంట్రోల్ రూమ్ కు వచ్చే ఫిర్యాదుల్లో వుండే అంశాలను ఆధారం చేసుకొని జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కుడా ఈ సమస్యలు లేకుండా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేవిధంగా కంట్రోల్ రూమ్ పనితీరు వుండాలన్నారు. తద్వారా ఇతర ప్రాంతాల్లో ఆయా సమస్యలు ఏర్పడకుండా సరిచేసే వీలు కలుగుతుందని చెప్పారు. 1902 కాల్ సెంటర్ కు జిల్లా నుండి వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారం పై కలెక్టర్ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న డిప్యూటీ కలెక్టర్ కె.సందీప్ కుమార్, సిబ్బందితో సమీక్షించారు. కాల్ సెంటర్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుకు సంబంధించి ప్రభుత్వ పరంగా పరిష్కారానికి చేపట్టిన చర్యలను ఆయా ఫిర్యాదుదారుకు తప్పనిసరిగా ఫోన్ ద్వారా తెలియజేయాలన్నారు. కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులపై ఒక విశ్లేషణ చేసి ఏ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఏ సమస్యలపై తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయో సంబంధిత శాఖలను అప్రమత్తం చేసే విధంగా కంట్రోల్ రూమ్ చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో లాక్ డౌన్ సహాయంగా శనగలు స్టాక్ లేకపోవడంపై జిల్లా పౌరసరఫరాల అధికారిని ప్రశ్నించారు. రేషన్ కార్డు పోర్టబిలిటీ కారణంగా అన్ని కార్డులపై తగినంత స్టాకు లేక శనగలు సరఫరా చేయలేక పోయామని డి.ఎస్.ఓ. పాపారావు వివరించారు. జిల్లాకు సంబంధించి ఈ కాల్ సెంటర్ కు 19 కాల్స్ వచ్చాయని వీటిని సంబంధిత శాఖలకు తెలియజేసి పరిష్కరిస్తున్నట్టు కంట్రోల్ రూమ్ ఇన్ ఛార్జ్ సందీప్ తెలిపారు. ఇందులో పౌరసరఫరాలు, మునిసిపాలిటీలు, పారిశుద్ధ్య సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు.
No comments:
Post a Comment