108 కు కాల్స్ వెల్లువ ..
మద్యం షాపులు తెరిపించండి ..
గోడు వెళ్ళబోసుకుంటున్న మందుబాబులు.
స్టేట్ బ్యూరో పెన్ పవర్, తెలంగాణ
కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపధ్యంలో వ్యాప్తిని అరికట్టటానికి చేసిన లాక్ డౌన్ తో మందుబాబుల బాధ వర్ణనాతీతంగా మారింది. మందు కోసం ఉన్మాదుల్లా మారుతున్నారు.పిచ్చివాళ్ళవుతున్నారు . పిచ్చివారిగా ప్రవర్తిస్తున్నారు. మద్యం దొరకని అసహనం, కోపం వెరసి కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొందరు దాడులకు, దోపిడీలకు దిగుతున్నారు. కొందరు మందు కావాలి మహాప్రభో అని ప్రాధేయ పడుతున్నారు. మద్యానికి బానిసలైన వారు మద్యం లేకుండా ఉండలేకపోతున్నారు.
కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి మందుబాబుల ఆవేదన
లాక్‌డౌన్ సమయంలో దాదాపు అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్న పరిస్థితి . ఈ సమయంలో మానసిక సంక్షోభం నెలకొంటుందని భావించి మానసిక సమస్యల పరిష్కారానికి జీవీకే-ఈఎంఆర్‌ఐ సంస్థ ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది . ఇక ఈ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి మద్యం లేకపోతే చచ్చిపోవాలనిపిస్తోందని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం . ఇక అంతేకాదు దయచేసి వెంటనే వైన్ షాపులు తెరిచేలా చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారట.
108కి ఫోన్ చేస్తే సైకాలజిస్టుల సలహాలు.. కాల్స్ చేస్తుంది మందుబాబులే
లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు మానసిక ఇబ్బందులుంటే వారిని కాస్త ఆ మానసిక సమస్యల నుండి బయటకు తీసుకురావటానికి , వారికి సలహాలు ఇవ్వడానికి ఈ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇక 108కి ఫోన్ చేసి సైకాలజిస్టుల సలహాలు పొందవచ్చు. ఈ కాల్ సెంటర్‌ను రెండు వారాల క్రితమే ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిన కాల్స్ లో చాలా కాల్స్ మద్యం కోసమే కావటం పరిస్థితి ఎలా ఉందో చెప్తుంది . ఈ కాల్ సెంటర్‌కు వచ్చే ఫోన్ కాల్స్‌లో దాదాపు 80 శాతం మందుబాబుల కాల్స్ ఉండటం, ఇక వారు వైన్స్ షాపులు తెరిపించండి అని డిమాండ్ చేసేవారే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం .
ఆస్పత్రుల్లో మద్యానికి బానిసలైన వారి చికిత్స పై పెట్టని శ్రద్ధ
మద్యం దొరక్క తీవ్రమైన మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నవారికి హైదరాబాద్‌తో పాటు, ప్రతి జిల్లాలలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు.వారిని మార్చటానికి ప్రయత్నం చెయ్యాలని చెప్తుంది సర్కార్ . ఇక సీఎం కేసీఆర్ కూడా ఆ దిశగా వారిలో పరివర్తన తీసుకురావాలని సూచించారు. కానీ ప్రస్తుతం వైద్యుల అందరి దృష్టి కరోనా కేసుల మీదే ఉంది . దీంతో ఇలాంటి రోగులకు చికిత్స వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం వైద్యులకు ఇబ్బందికరంగా మారింది .ఇక మద్యం కోసం పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తున్న వాళ్లకు ఏం చెప్పాలో తెలియడం లేదని కాల్ సెంటర్ అధికారులు చెబుతున్నారు.
ప్రాణాలకే ప్రమాదం అంటున్న మానసిక నిపుణులు .. ప్రభుత్వ దృష్టి అవసరం
ఇక వారికి కావాల్సింది మద్యం .. అది లభించకపోతే మూడు వారాల తర్వాత వారిలో అనేక మార్పులు సంభవిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి వారి పరిస్థితి విషమించి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వీళ్ళకు కౌన్సిలింగ్ తో పాటు వీరికి చికిత్స అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి . లేదంటే మానసిక సమస్యతో మందుబాబులు ప్రాణాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు
No comments:
Post a Comment