Followers

నోటీసులకు రంగం సిద్ధం చేస్తున్న ఎస్ ఇసి...


 


నోటీసులకు రంగం సిద్ధం చేస్తున్న ఎస్ ఇసి ?


ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా... ఎస్ ఇసి పై ఆగని మాటల తూటాలు


వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్నఎస్ ఇసి


రెండు, మూడు రోజుల్లో స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చేనా?


వ్యక్తిగతంగా కులం పేరుతో ఎస్ఎసి ని దూషించడమే అందుకు కారణమా..?


స్వయం ప్రతిపత్తి కల్గిన రాష్ట్రా ఎన్నికల సంఘం పై కులం బురద జల్లడాన్ని నిశితంగా పరిశీలిస్తున్న కేంద్రం


నోటీసులకు సమాధానం ఇవ్వని పక్షంలో ఎస్ఇసి నిర్ణయం ఏం తీసుకోనుందో?


మరో ఆరు వారాల పాటు ఎన్నికల కోడ్ అమలు


ఎన్నికలు జరపాలని ఎపి ప్రభుత్వం వేసిన కేసును సీరియస్ గా తీసుకోని సుప్రీం కోర్టు


(ఎడిటర్, పెన్‌పవర్ )


రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్,  రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, విలకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత రెండు రోజులుగా రాష్ట్రంలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ విట్లు ఎన్నికల కోడ్ అమలులో ఉందని మరచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్ద మార్కులు కొట్టేసేందుకు ఏకంగా ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌ను కులం పేరు పెట్టి మరీ నానా దుర్భాషలాడారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన ద్వివేదిపై చేసిన వ్యాఖ్యలను ఆయన కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు నోటీసులు కూడా అందజేశారు. అదే విధంగా నేడు అధికార పార్టీ నేతలు మరో ముందడుగు వేసి ఏకంగా ఆయన సామాజికవర్గాన్ని వేలెత్తి చూపుతూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడడంపై రాజకీయ వర్గాల్లో సైతం పెద్ద చర్చ సాగుతోంది. వాస్తవానికి ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎన్నికల కమిషనరే సుప్రీం. రెండు రోజుల క్రితం వరకు ఎన్నికల కమిషనర్, ఫలానా కులానికి చెందిన వాడు అని గుర్తుకు రాని అధికార పార్టీకి...  ఎన్నికలు వాయిదా వేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే గుర్తుకు రావడం ఏమిటని పలువురు ఆ పార్టీకి చెందిన నేతలే  విస్తుపోతున్నారు. వాస్తవానికి ఎన్నికలు జరిగే సమయంలో ఎన్నికల అధికారికి ఎన్నికలకు సంబంధించి పూర్తి అధికారాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల వాయిదా విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో కనీస చర్చలు జరపకపోవడం సమంజసం కాదన్నది ప్రభుత్వ వాదన. అయితే ఎన్నికల కమిషనర్ మాత్రం తాను ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో ఒక్క సారిగా ముఖ్యమంత్రి ఆయన వ్యవహార శైలిపై మీడియా సమావేశం పెట్టి దుయ్యబట్టారు. అనంతరం ఎన్నికల కమిషనర్ సైతం మీడియా సమావేశం పెట్టి ఎన్నికలు అసలు ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో మీడియాకు వివరించారు. కరోనా వైరస్ ప్రభావం తీవ్రమవుతుందనే ఆలోచనతోనే ఎన్నికలు వాయిదా వేశామని ప్రకటించారు. కాని అధికార పార్టీ నేతలు మాత్రం చంద్రబాబుకు కొమ్ము కాసి ఎన్నికలు వాయిదా వేశారని ఎస్ఇసి ని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియా సమావేశం పెట్టి మరీ ఎస్ఎసి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ హొదాను మరచి ఎస్ఇసి ని దుయ్యబట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆయన మాటల వీడియోని అందరూ చూసిందే. ఇలా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆదిములపు సురేష్, పేర్ని నాని, తానేటి వనిత, ప్రభుత్వ విప్ కుపు రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు జోగి రమేష్ మరి కొంత మంది ప్రజా ప్రతినిధులు ఇష్టం వచ్చినట్లుగా ఎస్ ఇసి కి కుల గజ్జి ఉందని, కరోనా వైరస్సా లేక కమ్మ వైరస్సా అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు. వీటితో పాటు ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్నందున ఆ పిటీషన్ ను అంత సీరియస్ గా తీసుకోలేదు. కేవలం అత్యవసరమైన కేసులను మాత్రమే అనుమతిస్తామని చెప్పింది. అదే సమయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 3 పేజీలతో రాష్ట్ర సిఎస్ నీలం సాహ్ని కి ఎన్నికలు వాయిదాను నిలుపుదల చేసేది లేదని స్పష్టం చేస్తూ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, మీరు భావిస్తున్నట్లుగా 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా వెనక్కు పోవని ఆయన ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇలా ఓ వైపు ఎస్ఇసి తన పని తాను చేసుకుంటుండగా, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఎస్ఇసి పై చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరే అవకాశం లేకపోలేదు. వారు చేసిన వ్యాఖ్యలు అన్ని వీడియోలు స్పష్టంగా ఉండడంతో అందరికీ నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణ కోరే అవకాశం ఉందని రాష్ట్రా ఎన్నికల సంఘం అధికార వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ  సమాచారం. అయితే ఈ స్థాయిలో ఎస్ఇసి పై మాటల దాడి చేసిన దాఖలాలు కూడా రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదని పలువురు సీనియర్ నాయకులు చెబుతున్నారు. మొత్తం మీద అసలు ఎస్ఇసి స్వయం ప్రతిపత్తి కల్గిన హోదాలో వారిపై చేసిన వ్యాఖ్యలకు చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు కేవలం వాయిదా మాత్రమే పడ్డాయి కాని అసలు ఎన్నికలు ఆగలేదు కదా అనే సమాధానం కూడా ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తుంది. మొత్తం మీద ఎస్ఇసి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎటువంటి చర్యలు ఉంటాయో మరి కొద్ది రోజుల్లో తేలనున్నట్లు సమాచారం.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...