Followers

స్థానిక ఎమ్మెల్యే అండతోనే ఇసుక దోపిడీ 



కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ బండారు

 

రావులపాలెం, పెన్ పవర్  :కొత్తపేట నియోజక వర్గంలో స్థానిక ప్రజాప్రతినిధి అండ దండలతోనే ఇసుక దోపిడీ జరుగుతోందని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బండారు సత్యానందరావు ఆరోపించారు. మంగళవారం రావులపాలెంలోని కె.వి సత్యనారాయణ రెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొత్తపేట నియోజక వర్గంలోని రావులపాలెం మండలం గోపాలపురం లో జరుగుతున్న ఇసుక దోపిడీ ని ప్రభుత్వ అధికారులు వెలికి తీయడంతో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి బండారం బయట పడిందన్నారు. 2014 సంవత్సరం నుంచి కూడా ఇసుక  దోపిడి ఆ ప్రతినిధి కనుసన్నల్లోనే జరుగుతోందని అన్నారు.ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని అధికారులును బెదిరించడం ఆయనకు కొట్టిన పిండని ఎద్దేవా చేశారు. తన అక్రమాలను కప్పి పుచ్చుకొని  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై బురదజల్లి   ఎన్నికల్లో లబ్ది పొందారన్నారు.రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇసుక రీచ్ లన్నిటిని తన గుప్పిట్లో పెట్టుకుని భారీ దోపిడీకి శ్రీకారం చుట్టారని ,9 నెలల కాలంలో కోట్లాది రూపాయలు అక్రమార్జన చేసారని ఆరోపించారు.  రెవెన్యూ పోలీసు అధికారులు ప్రజాప్రతినిధితో కుమ్మక్కై అక్రమాలను వెలుగులోకి రాకుండా చేస్తున్నారన్నారు. ప్రజా ప్రతినిధి ఆదేశాలతో  మాఫియా రెచ్చిపోయి విచ్చలవిడిగా ఇసుకను బయట  ప్రాంతాలకు తరలిస్తోందని, రాష్ట్రంలో ఉన్నతాధికారులకు వచ్చిన సమాచారం మేరకు దాడులు జరిపి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చిందన్నారు. అక్రమాలను అడ్డుకుంటున్న అధికారులకు అండగా నిలవకుండా అనుచరులుతో వచ్చి అడ్డు కోవడం అవినీతిని కప్పి పుచ్చుకోవడం కోసమేనని, ఉన్నతాధికారులు ఇదే విధంగా నియోజకవర్గంలోని ర్యాంపు అన్నింటిలోని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమాలను వెలుగులోకి తెస్తే ఈ ప్రతినిధి  యొక్క బండారం పూర్తిగా బయట పడుతోందన్నారు. అక్రమాలకు అండదండలు అందిస్తున్న  అధికారులను తక్షణమే బదిలీ చేసి  ఇసుక పేదలకు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు ఆకుల రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు గుత్తుల పట్టాభి రామారావు,జక్కంపూడి వెంకట స్వామి, దాసరి వెంకట ప్రసాద్, కేతా శ్రీను, గుర్రాల నాగభూషణం, నెక్కంటి వెంకన్న , నెంబర్ ఒన్ శ్రీను,చింతా శ్రీరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...