ఒంగోలు, పెన్ పవర్
ఎమర్జెన్సీ అమలులో వున్నప్పటికి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక జిల్లా అధికారి, ఒక వైద్య అధికారి, మరో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శ్రీ పోల భాస్కర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం యుద్ధం చేస్తుండగా విధులకు గైర్హాజరవడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక అనుమతులు లేకుండా ఒంగోలు విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన జిల్లా సోషల్ ఫారెస్ట్ అధికారి కె. మహబూబ్ బాషాను కలెక్టర్ సస్పెండ్ చేశారు. మార్కాపురం ఏరియా వైద్య శాలలో వైద్య అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ ఎస్. హరి (జనరల్ మెడిసిన్) విధులకు గైర్హాజరైనందున తక్షణమే ఆయనను సస్పెండ్ చేశారు. ఎమర్జెన్సీలో వైద్యం అందించాల్సిన డాక్టర్ ప్రభుత్వ ఉత్తర్వుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయన పై అవసరమైతే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ బి. ప్రసన్న కుమార్, రికార్డ్ అసిస్టెంట్ పి. వెంకట్రావులను కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎమర్జెన్సీ అమలులో వుండగా అనుమతి లేకుండా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విధులకు హాజరుకాని పక్షంలో లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సర్క్యులర్ ను జారీ చేశారు.
No comments:
Post a Comment