అమరావతి, పెన్ పవర్
- ఇది ఏ కుట్రలో భాగమో...???
- నాకు ప్రాణహాని తలపెట్టారు రక్షించండి
- కేంద్ర హోంశాఖకు సంచలన విషయాలతో లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్
కరోనా కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా వేశాననే కారణంతో ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వం వహిస్తున్న నేత నాపై కక్ష పెంచుకున్నారు. నాకు, నాకుటుంబానికి ప్రాణహాని ఉంది. ఏపీలో మాకు భద్రతలేదు. కేంద్రబలగాలతో మాకు రక్షణ కల్పించండి, హైదరాబాద్‌లో నివసించేందుకు అనుమతి ఇవ్వండి.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన నుంచీ జరిగిన సంఘటనలన్నీ మీకు నివేదిస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక మొదటి దశ ఎన్నికల్లో పోలీసుల మద్దతుతో కనివినీ ఎరుగని హింసకు అధికార పార్టీ పాల్పడింది.దీనిపై విపక్షాల నుంచి ఫిర్యాదులు అందాయి.అధికార పార్టీ వారు 35 చోట్ల హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు.23 చోట్ల బెదిరించి, భయపెట్టి ప్రత్యర్థులతో నామినేషన్లు విత్‌డ్రా చేయించారు. పోటీ చేయాలనుకుంటున్న విపక్షాల అభ్యర్థులే లక్ష్యంగా 55 చోట్ల దాడులు చేశారు. 2014లో 16589 ఎంపీటీసీ స్థానాలలో 386 ఏకగ్రీవం అయ్యాయి. 2020లో ఎంపీటీసీ 9696 ఎంపీటీసీ స్థానాలలో 2362 ఏకగ్రీవం అయ్యాయి. 2014లో 1096 జెడ్పీటీసీ స్థానాలలో 1 స్థానంలో ఏకగ్రీవం కాగా, 2020లో 652 జెడ్పీటీసీ స్థానాలలో 126 ఏకగ్రీవం అయ్యాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వైఎస్సార్ కడపలో 553 ఎంపీటీసీలకు గానూ 439 ఏకగ్రీవం కాగా, 50 జెడ్పీటీసీ స్థానాలకు గానూ 38 ఏకగ్రీవం అయ్యాయి. ఒక ఓటూ పడకుండానే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎన్నిక జరగకుండా ఎంపికలు జరిగాయి. బెదిరించో, భయపెట్టో ఏకగ్రీవం చేయకపోతే మంత్రి పదవులు పీకేస్తానని సీఎం హెచ్చరించడంతో ఇటువంటి అప్రజాస్వామికమైన ఏకగ్రీవాలు దారి తీశాయి. మీడియా వస్తున్న వార్తలు, ప్రతిపక్షాల ఫిర్యాదులుపై గంట గంటకూ క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించాను. వాస్తవాలకు, ప్రభుత్వం కనుసన్నల్లోని అధికార యంత్రాంగం ఇచ్చిన నివేదికలకు పొంతనే లేదు. పోటీ చేయడానికే ప్రతిపక్షాలు భయ పడ్డాయి. ఓటు వేసేందుకు కూడా బూత్‌లకు వచ్చే అవకాశం లేనంతగా మానసికంగా ప్రజలు భయపడ్డారు. ఒక వేళ పోలింగ్ జరిగినా పోలింగ్ శాతం అథఃపాతాళానికి దిగజారేది. పోలింగ్‌కి ఉన్నత వర్గాలు కరోనా భయంతో దూరం అయ్యేవి. స్థానిక సంస్థలలో మొదటి దశే ఈ స్థాయిలో ఏకగ్రీవం చేసిన పరిస్థితిని అంచనా వేసుకుంటే, పంచాయతీ ఎన్నికల్లో 70 శాతానికి పైగానే ఏకగ్రీవం చేసేవారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, కేంద్ర ప్రభుత్వం, యితర రాష్ట్రాలలో పరిస్థితులు చూసి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశాను. కరోనా ప్రభావంతో నేను తీసుకున్న ఎన్నికల వాయిదా నిర్ణయం పాలకపక్షానికి అస్సలు నచ్చలేదు. నేను ఎన్నికలు వాయిదా నిర్ణయం తీసుకున్న తరువాత మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలు స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా వేశాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల వాయిదాపై సుప్రీం కోర్టుకెళ్లింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గుంటూరు, చిత్తూరు జిల్లాల ఎస్పీలు..కలెక్టర్లు, శ్రీకాళహస్తి.. పలమనేరు డీస్పీలు, పుంగనూరు, రాయదుర్గం సీఐల బదిలీలకు ఆదేశాలిచ్చాను. మాచర్ల సీఐ సస్పెన్షన్ చేయాలని కోరాను. ఎన్నికల కమిషనర్‌గా నేనిచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కనబెట్టింది. సుప్రీంకోర్టులో ఎన్నికల వాయిదాపై కేసు వేశాం అందుకే ఏ చర్యలు తీసుకోలేదనే సమాధానం ఇచ్చింది.
ఎన్నికలు వాయిదా అనంతరం ఏకంగా సీఎం నన్ను కులం పేరుతో దూషించారు. సీఎంని ఆదర్శంగా తీసుకుని స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో వున్న నన్ను అమానవీయంగా దూషించడమే కాకుండా భయపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న నా శ్రేయోభిలాషులు, సహచరులు నాకు, నా కుటుంబసభ్యుల భద్రతపై తీవ్రత ఆందోళన వెలిబుచ్చుతున్నారు. పాలకపక్ష నాయకుడు గత చరిత్ర, ఫ్యాక్షన్ మనస్తత్వం తలచుకుంటేనే భయమేస్తోంది. అటువంటి ఆయన నుంచే ఇటువంటి బెదిరింపులు రావడం నన్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలకు గౌరవం ఇవ్వడంలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నా సర్వశక్తులూ వొడ్డుతున్నాను. రాష్ట్రంలో ఈ దౌర్జన్యాలు ఇలా వదిలేస్తే ప్రతిపక్షాలు నిర్వీర్యం అవుతాయి. ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మీడియా ముఖంగా బహిరంగంగా హెచ్చరిస్తున్న నేతల వల్ల నేను బయట తిరిగే పరిస్థితి లేదు. ఈ ఎన్నికలు ముగిశాక అయినా నేను, నా కుటుంబసభ్యులు బయట తిరిగే పరిస్థితి లేదు.ఈ హింసకు నాయకత్వం వహిస్తున్న వారి ప్రతీకార స్వభావం, నేరచరిత్ర చూసినా, వారి నుంచి వస్తున్న బెదిరింపు హెచ్చరికలు చూసినా నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉందని అర్థం అవుతోంది. అధికారం ఉంది, క్రిమినల్ గ్యాంగులున్నాయి, వారి పుట్టుపూర్వోత్తరాలు చూస్తే ఒకరి చంపడం వారికి పెద్ద కష్టమైన పని కాదు. ఏపీ పోలీసులు నన్ను కాపాడలేరు..దయచేసి కేంద్రబలగాలతో రక్షణ కల్పించండి. నేను, నా కుటుంబం హైదరాబాద్‌లో ఉండి విధులు నిర్వహించేలా అనుమతించండి. కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ జోక్యం చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత ఉంది. నాకు, నా కుటుంబానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాను.
ఇట్లు
నిమ్మగడ్డ రమేష్‌కుమార్, రిటైర్డ్ ఐఏఎస్
ఎన్నికల కమిషనర్,
No comments:
Post a Comment