ప్రతీ మండలంలో ఒక కేంద్రం ఏర్పాటు
జాయింట్ కలెక్టర్-2 ఆర్.కూర్మనాధ్
వలస కూలీలు, అనాధలకోసం సహాయ కేంద్రాలు
జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు
తాశీల్దార్లు, ఎంపిడిఓలతో వీడియో కాన్ఫరెన్స్
విజయనగరం, పెన్ పవర్
జిల్లాలో మొత్తం ఐదువేల పడకలతో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్-2 ఆర్.కూర్మనాధ్ చెప్పారు. దీనిలో భాగంగా కనీసం వంద పడకలతో ప్రతీ మండలంలో ఒక క్వారంటైన్ కేంద్రాన్నిఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తాశీల్దార్లు, ఎంపిడిఓలతో సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జెసి 2 మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం నాటికి అన్ని మండలాల్లో క్వారంటైన్ కేంద్రాలను కావాల్సిన వసతులతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికోసం హాస్టల్ భవనాలు, హొటళ్లు, కల్యాణ మండపాలు ఇలా అందుబాటులో ఉన్న వాటిని గుర్తించాలని సూచించారు. ప్రతీ కేంద్రానికి ఒక నోడల్ ఆఫీసర్‌ను, అతని ఆధ్వర్యంలో పనిచేసేందుకు ఒక బృందాన్ని నియమించాలని సూచించారు. ఈ కేంద్రాల్లో వసతులకు ఎటువంటి లోటు లేకుండా, పడకలు, బాత్‌రూములు, త్రాగునీరు తదితర అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని స్పష్టం చేశారు.
జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు మాట్లాడుతూ వలస కూలీలు, విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చిక్కుకుపోయినవారు, అనాధల కోసం రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల అలాంటి వారిని గుర్తించడం జరిగిందని, వారికి తక్షణమే భోజన సదుపాయాన్ని కల్పించాలన్నారు. ఒకవేళ ఎవరైనా భోజనం చేయడానికి ఆసక్తి కనపర్చకపోతే, వారికి నిత్యావసర సరుకులను అందజేయాలని సూచించారు. వీటికోసం వసతి గృహాలను, కెజిబివి పాఠశాలలను తీసుకోవాలన్నారు. ప్రతీ కేంద్రం వద్దా బోర్డును ఏర్పాటు చేయాలని, ఆయా కేంద్రాల పరిధిలో ఉన్నవారి పేర్లతో రిజిష్టర్ తయారు చేయాలని సూచించారు. అలాగే వీరికి ఆయా హాస్టళ్లలో ఇప్పటికే స్టాక్ ఉన్న బియ్యం, పప్పులు తదితర సరుకులను వినియోగించాలని, అవికూడా చాలకపోతే ప్రక్క హాస్టల్‌లోని సరుకులను కూడా తీసుకోవాలని చెప్పారు. తీసుకున్న సరుకులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆయా హాస్టళ్లకు నగదు చెల్లించడం జరుగుతుందన్నారు. అలాగే భోజనం నాణ్యతలో ఎక్కడా తేడా రాకుండా చూడాలని, ఈ కేంద్రాలకు ఆయా వసతిగృహాల సంక్షేమాధికారులే ఇన్ఛార్జిలుగా వ్యవహరిస్తారని డిఆర్ఓ స్పష్టం చేశారు.
లీఫ్ సెంటర్స్ జిల్లా నోడల్ ఆఫీసర్, జిల్లా అటవీశాఖాధికారి లక్ష్మణ్, డిపిఓ మరియు సాంఘిక సంక్షేమశాఖ డిప్యుటీ డైరెక్టర్ కె.సునీల్‌రాజ్‌కుమార్, జిల్లా బిసి సంక్షేమాధికారి కీర్తి, జిల్లా పరిషత్ సిఇఓ టి.వెంకటేశ్వర్రావు తమ శాఖల పరంగా మాట్లాడి, తాశీల్దార్లకు, ఎంపిడిఓలకు, వసతిగృహ సంక్షేమాధికారులకు వివిధ సూచనలిచ్చారు.
No comments:
Post a Comment