Followers

తెరపైకి గాడ్ ఆఫ్ యాక్టు ! 


 


కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్రం 
గాడ్ ఆఫ్ యాక్టు పేరుతో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడనుందా?
 స్థానిక సంస్థల ఏకగ్రీవాలపై కోర్టుకు వెళ్ళేందుకు బిజెపి, జనసేన ఆలోచన 
ఈ పాటికే పలు సమావేశాల్లో ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలంటూ ఉద్ఘాటన 
ఏకగ్రీవాల సమయంలో జరిగిన అవాంఛనీయ ఘటనలపై ఈ పాటికే కేంద్రానికి ఎస్ఎసి నివేదిక 
ప్రజాస్వామ్య దేశంలోని ఓటు హక్కును హరించే విధంగా ఏకగ్రీవాలు జరిగాయంటున్న విశ్లేషకులు
 నోటా ఉన్న సమయంలో ఏకగ్రీవం ఎలా అవుతుందోనన్న అనుమానాలు వ్యక్తం 
ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ పైనా ప్రభావం పడేనా ? 
అంత జనసంద్రం ఒక్క దగ్గర చేరితే వ్యాధి వ్యాపించే అవకాశం ఉండదా ? 
ఈ పాటికే జిల్లాల్లో పలు అనుమానిత కేసులు 
(స్టేట్ పోలిటికల్ బ్యూరో, పెన్ పవర్) 



తెర పైకి గాడ్ ఆఫ్ యాక్టు వస్తోంది. దీనినే ఇప్పుడు బిజెపి, జనసేన స్థానిక సంస్థల ఎన్నికల రద్దుకు ఉపయోగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో తమ నాయకులు నామినేషన్లు దాఖలు చేయకపోవడానికి కరోనానే కారణమంటూ కొత్త వాదనను తెరపైకి తేనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే నాటికే ప్రపంచంలో కరోనా వ్యాధి సోకింది. అయితే ఈ వ్యాధి పై పూర్తి అవగాహన కల్గిన బిజెపి, జనసేన కేంద్రం ఆదేశాలతో కొన్ని ప్రాంతాల్లో నామినేషన్లకు దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. నామినేషన్ల ప్రక్రియలో జన సందోహం ఎక్కువగా ఉంటారు కాబట్టి వాటికి దూరంగా ఉండి కరనో వ్యాధి ఎక్కువ కాకుండా ఉండేందుకు తాము నామినేషన్ల ప్రక్రియకు దూరంగా ఉన్నట్లు వారు చెబుతున్నారు. దీనికి తోడు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభించిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఏకగ్రీవాలు కుప్పలు, తెప్పలుగా అయ్యాయి. వీటిలో ప్రధానంగా అధికార పార్టీ బెదిరింపుల వలనే నామినేషన్లకు వివిధ పార్టీల నేతలు దూరమయ్యారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో గుంటూరు, చిత్తూరు జిల్లాలో జరిగిన పలు దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజీలను ఈ పాటికే రాష్ట్ర ప్రజలు చూసిన సంగతి పాఠకులకు విథితమే. వాస్తవానికి దేశంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగుతోంది. ప్రజాస్వామ్యంలో సగటు మనిషికి ఓటు హక్కు ప్రధాన హక్కు. కాని ఈ ఎన్నికల్లో చాలా ప్రాంతాల్లో ప్రజలు వారి ఓటు హక్కును వినియోగించుకోకుండానే ప్రజాప్రతినిధుల ఎంపిక సాగింది. రాష్ట్రంలో ఏ నాడు ఈ స్థాయిలో ఏకగ్రీవాలు జరగలేదన్న వాస్తవాలను ఈ పాటికే ఎఫేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన సంగతి మనకు తెలిసిందే. గత ఎన్నికల్లో 2 శాతం మాత్రం జరిగిన ఏకగ్రీవాలు నేడు 24 శాతం వరకు పెరిగడంపైన కూడా ఎస్ఎసి నివేదికను అందించినట్లు విశ్వసనీయ సమాచారం. న్యాయపరమైన అంశాల్లో భాగంగా నోటా ఓటు ఉన్నపుడు ఏకగ్రీవాలు చేయడానికి వీలుపడదన్న కనీస ఆలోచన కూడా రిటర్నింగ్ అధికారులు చేయలేదన్న వాదనను సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. 5 శాతం లోపు కనుక ఏకగ్రీవాలు జరిగితే వివిధ రాజకీయ పార్టీలు ఈ విషయాలపై పెద్దగా దృష్టి సారించేవి కావని వారు వ్యాఖ్యానిస్తున్నారు. 24 శాతం ఏకగ్రీవాలు కావడంతోనే ప్రస్తుతం న్యాయపరమైన అంశాలపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. కరోనా వ్యాధి ఒక కారణంగా చూపడంతో పాటు మరో వైపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన అవాంఛనీయ సంఘటనల వీడియోలను సాక్ష్యాలుగా చూపిస్తూ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని కోరుతూ నేడో, రేపో పలు పార్టీలు కోర్టులను ఆశ్రయించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బిజెపి, జనసేన గాడ్ ఆఫ్ యాక్టు ద్వారా కోర్టులను ఆశ్రయించే విషయాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ప్రతిపక్ష టీడీపీ పార్టీ మాత్రం రాష్ట్రంలో జరిగిన అవాంఛనీయ సంఘటనల వీడియోలను సాక్ష్యాలుగా సిద్ధం చేస్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఏకగ్రీవాలలో అధికారపార్టీ ఏ విధంగా తమ వారిని లొంగదీసుకుందో వాటికి సంబంధించి వీడియో, ఆడియో ఆధారల కోసం రహస్యంగా నివేదికలు అధిష్టానం తెప్పించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుంచి తమ పార్టీలోని వ్యక్తులను ప్రలోభాలకు గురి చేసిన సంఘటనలన్నింటిని క్రోడీకరించి కోర్టుకు వెళ్లి ఏకగ్రీవాలను కూడా రద్దు చేయించే పనిలో ఉన్నట్లు సమాచారం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన ఆర్డినెన్స్ వారికి మరో ఆయుధంగా మారిందని పార్టీలోని సీనియర్ నేతలు కొందరు చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికలు మొదలు కాకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించి ఆర్డినెన్స్ కూడా తయారు చేశారు. ఎన్నికలలో ఏ పార్టీ వారు అయినా సరే ప్రలోభాలకు గురిచేసి అధికారం చేజిక్కించుకున్నా అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు కనుక ఎన్నికల కమిషన్ కు అందజేస్తే వారు పదవిలో కొనసాగుతున్న వెంటనే వారి పదవిని రద్దు చేసేందుకు ఓ చట్టం చేశారు. ఇప్పుడు ఆ చట్టాన్నే తెలుగుదేశం పార్టీ ఆయుధంగా వాడుకునేందుకు సిద్ధమవుతోంది. మొత్తం మీద రాష్ట్రంలో జరిగిన ఏకగ్రీవాలపైన కూడా నీలినీడలు కమ్మేస్తున్నాయి. నిజాయతీగా ఏకగ్రీవం అయిన వారికి ఏ భయం లేకపోయినా, ప్రలోభాలకు గురి చేసి ఏకగ్రీవం చేయించుకున్న నాయకుల పరిస్థితి ఏమవుతుందో కాలమే నిర్ణయించాలి. దీనికి తోడు ఉగాది నాటికి ఇళ్ళ పట్టాల పంపిణీని అట్టహాసంగా చేయాలనుకున్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం కష్టమనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రంలో పెరిగే ప్రమాదముందని భావించి ఈ పాటికే విద్యాసంస్థలకు పూర్తిగా సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఉగాది సంబరాలను కూడా ఆలయాల్లో నిలుపుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఉగాది రోజున అట్టహాసంగా నిర్వహించే ఇళ్ళ పట్టాల పంపిణీకి అత్యధిక జన సంద్రం సేకరించడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పాటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు సమూహంగా ఉన్న చోట్లకు దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తుంది. మరి ఉగాది రోజున నిర్వహించే పంపిణీకి ఏ హంగూ, ఆర్భాటం లేకుండా పంపిణీకి సిద్ధపడతుందా లేదా అన్నది ఇంకా తేలలేదు. మరో వారం రోజుల్లో ఉగాది పండుగ రానుంది. ఇక దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈ పాటికే జిల్లాలో కరోనా వైరస్ అనుమానిత కేసులు నమోదు అయ్యాయి. మరి ఈ నేపథ్యంలో ఇళ్ళ పట్టాల పంపిణీ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...